Monday, 18 July 2011

పసిపాపల్ని దారుణంగా చంపేశారు ...

బిడ్డ చిరునవ్వు చూసి లోకాన్ని మరచిపోయే తల్లుల్ని చూశాం. పసికందుకోసం కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదురీదే అమ్మల్ని చూశాం. అమ్మతనపు కమ్మదనం సాక్షిగా, మమతల మాధుర్యం తోడుగా ప్రపంచాన్ని ఎదుర్కొనే కడుపుతీపిని చూశాం.
       మరొ ప్రక్క  తల్లులు తమ ప్రేమాప్యాయతలకన్నా, ముద్దుమురిపాలకన్నా బిడ్డ కడుపు నిండటమే ముఖ్యమనుకున్నా వారు.  తమవద్ద ఉండి పస్తులుండేకన్నా ఎక్కడున్నా తమ బిడ్డలు సుఖంగా ఉంటే చాలనుకునే నిస్సహాయస్థితిలో ఉన్న వారు . పిల్లల భవితవ్యంకోసం గత్యంతరం లేక అనురాగాన్ని గుండెలోతుల్లో అదుముకున్న మాతృమూర్తులు  ఉన్నరు.

               కన్నతల్లి కర్కశురాలా, కారుణ్యం లేనిదా, కాఠిన్యురాలా ?     పసిపాపల్ని దారుణంగా చంపేశారు ...
                కరీంనగర్ జిల్లాలో జులై 16 న  24 గంటల వ్యవధిలో కోరుట్ల లొ  వేర్వేరు ఘటనలు : నిద్రపోతున్న పాపని నీళ్లసంపులో పడేసి ఒకరు.., కన్నబిడ్డ గొంతు నులిమి మరొకరు చంపేశారు ...
             నిత్యం రాత్రి వేళ ఏడుస్తూ నిద్ర పోనీయడం లేదనే చిన్న కారణంతో రెండునెలల పసిగుడ్డును కడతేర్చారా కసాయి తల్లిదండ్రులు. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూతురును కిడ్నాప్ చేశారనే డ్రామాను తెరపైకి తెచ్చారు. పోలీసుల విచారణలో కట్టుకథ బట్టబయలవటంతో కటకటాల పాలయ్యారు. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో నివసిస్తున్న కూన రవీందర్, స్వాతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు చెర్రీకి రెండు నెలల 15 రోజుల వయసుంటుంది.
            రోజూ రాత్రిపూట నిద్ర పోకుండా ఏడవటమే ఆ పాప చేసిన తప్పుగా కనిపించింది వారికి. అంతేకాదు.. చెర్రీ పుట్టినప్పటి నుంచి తమకు ఏదీ కలిసి రావడంలేదన్న మూఢనమ్మకమూ తోడైంది. కన్నబిడ్డను చంపుకోవడానికి ఆ రెండు కారణాలు చాలనుకున్నారా కర్కోటకులు.

           మరోఘటనలోసైతం ఇదే తరహాలో.. లాలించి, పాలించి, అపురూపంగా చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిగా మారింది. ముక్కుపచ్చలారని రెండు నెలల పసిపాపను పీకపిసికేసి చంపేసింది. ఆడపిల్లగా పుట్టడమే ఆ చిన్నారి చేసిన నేరం.  కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రాంతంలో ఉంటున్న సాదుల్ల దుర్గయ్య, ముత్తవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.  రెండు నెలల క్రితం వారికి మరో ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు సునీత అని పేరుపెట్టారు. ఆడపిల్లను సాకడం కష్టమనుకుందో.. అధిక సంతానం భారమనుకుందోగానీ.. ముత్తవ్వ తన కడుపునపుట్టిన పాపనే గొంతునులిమి చంపేసేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన ఆమె పెద్ద కుమారుడు జగన్ లబోదిబోమంటూ బయటికి వచ్చి కేకలు వేశాడు.  స్పృహ కోల్పోయిన సునీతను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పాప మృతి చెందింది.

             చంటిబిడ్డ కెవ్వుమంటే చాలు, కన్నపేగు కదిలిపోతుంది. చిన్నారి కేరుమంటే చాలు, తల్లిమనసు తుళ్లిపడుతుంది. ఎక్కడున్నా ఒక్క క్షణంలో బిడ్డ ముందు వాలి అక్కున జేర్చుకుంటుంది. అలాంటి అమ్మే తన బిడ్డను కాదనుకుని చేతులారా   చంపేశారు       అందుకు కారణం  పేదరికం. నిరక్షరాస్యత. ముర్కత్వం ...   

Monday, 4 July 2011