Sunday 19 June 2011

మనుషులపైనా ప్రయోగాలు..... !

                    ఖమ్మం జిల్లా గిరిజన బాలికలపై చేసిన సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ప్రయోగం, పర్యవసానాలు మనోఫలకం నుంచి పూర్తిగా చెరగక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం  యావత్‌ ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. నిరక్షరాస్యులు, నిరుపేదలే లక్ష్యంగా ఔషధ కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు తాజాగా వెలుగులోకి రావడంతో రాష్ట్రం మరోసారి ఉలిక్కిపడింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రెక్కాడితేగానీ డొక్కాడని మహిళలకు డబ్బు ఎరగా వేసి ప్రయోగశాలలకు తరలించి చేసిన క్యాన్సర్‌, హెపటైటిస్‌ సంబంధిత మందుల ప్రయోగం పుణ్యమా అని తీవ్ర ఆరోగ్య సమస్యలతో అటు కూలిపనికీ, ఇటు ఇంటి పనికీ కాకుండా పోయారు. దళారుల మాయమాటల్లో పడి ఏదో కొద్దిగా రక్తం ఇస్తే పదివేలరూపాయల డబ్బు ముడుతుందన్న చిరు ఆశ తమను ఈ స్థితికి తీసుకొస్తుందని ఊహించని మహిళల బాధ అరణ్యరోదనగానే మిగిలింది.
                         కొత్తగా తయారుచేసే మందులు ఎంతమేరకు పనిచేస్తాయో తెలుసుకునేందుకు ముందుగా  పందులు, ఎలుకల మీద ప్రయోగించడం ప్రపంచంలో ఎక్కడైనా వున్నదే. మన రాజధానిలోని ఫార్మా కంపెనీలు నాలుగడుగులు ముందుకేసి ఏకంగా మనుషులమీదే ప్రయోగించబూనుకున్నాయి. అందుకు దళారుల ద్వారా డబ్బును ఎరగా వేశాయి. అంతా అత్యంత రహస్యంగా చేసేశాయి. ఆ మందులు మంచే చేస్తాయో చెరుపే చేస్తాయో ఏకంగా ప్రాణాలే తీస్తాయో తెలీని బీదాబిక్కీ అమాయకంగా ఆ ఉచ్చులో చిక్కుకున్నారు. 
                            భవిష్యత్తులో ఏ ఇతర కంపెనీలు ఈ విధంగా బరితెగించకుండా నిబంధనలను కఠినతరం చేయాలి. వెనువెంటనే అనుమతి లేని ఔషధ ప్రయోగాలను నిలిపివేయాలి. ప్రయోగాలకు పాల్పడుతున్న ఔషధ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా నిరంతరం స్పృహతో వుంటే తప్ప ఇటువంటి దారుణ 'ప్రయోగాల' నుంచి బయటపడలేరు. సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాల సందర్భంగా పార్లమెంటు లోపల వెలుపల వామపక్షాల చొరవతో జరిగిన చర్చల మూలంగానే కేంద్రం దిగి వచ్చి సంబంధిత కంపెనీకిచ్చిన అనుమతిని రద్దు చేసిండి.